లాయర్ దుస్తుల్లో హైకోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ
- ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేసు
- తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన మమత
- ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మమత పోరాడుతారన్న టీఎంసీ
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు కోల్కతా హైకోర్టులో విచారణకు హాజరయ్యారు. న్యాయవాది గౌను ధరించి ఆమె కోర్టుకు వచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై దాఖలైన కేసు విచారణ కోసం ఆమె నేడు కోర్టుకు హాజరయ్యారు. 15 ఏళ్ల టీఎంసీ పాలన ముగిసిన తర్వాత జరిగిన దాడులు, రాజకీయ ప్రతీకార చర్యలపై వస్తున్న ఆరోపణలను ఎదుర్కోవడానికి ఆమె స్వయంగా రంగంలోకి దిగడం విశేషం. సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ కుమారుడు శీర్షణ్య బందోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది.
న్యాయం, రాజ్యాంగ విలువల కోసం తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని నిరూపించడానికి మమత ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. "ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా, నిజం కోసం మమతా బెనర్జీ పోరాటం కొనసాగుతుంది" అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా పేర్కొంది. బీజేపీ అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె ఎప్పటికప్పుడు పోరాడుతున్నారని తెలిపింది.